Etela fires on CM KCR: రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని.. ఆయనకు భవిష్యత్తు లేదని అర్థమయ్యే ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెరాస ప్రభుత్వంపై ఈటల విమర్శలు గుప్పించారు.
గిరిజనుల భూముల్లో ట్రెంచ్‌లు కొడుతూ, వ్యవసాయ బావులు, బోరు బావులను పూడ్చివేస్తుంటే ఆ అంశాలపై ప్రతిపక్ష, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో లేవనెత్తినా ఫలితం లేదని ఈటల మండిపడ్డారు. మహబూబాబాద్‌లో మెడికల్ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పాలిట ధరణి వెబ్సైట్ శాపంగా మారిందిని ఈటల అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను గుంజుకుంటూ, ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు అమ్ముతోందని ఈటల ఆరోపించారు.
"గిరిజన కుటుంబాలు, గూడేల్లో అల్లకల్లోలం సృష్టించి వారి భూములను లాక్కుంటున్నారు. ట్రెంచ్‌లు కొడుతూ, వ్యవసాయ బావు, బోరు బావులను పూడ్చివేస్తూ.. విద్యుత్ కనెక్షన్లను సైతం తీసేస్తున్నారు. వీటిపై ప్రతిపక్ష, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తారు. మీ చేష్టలతో గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రజావసరాల కోసం వారి నుంచి భూములు తీసుకున్నప్పుడు అందుకు పరిహారం చెల్లించాలి. కానీ ప్రజలను వేధించడమే ఇక్కడ జరుగుతోంది. మెడికల్ కాలేజీ పేరిట 30 ఎకరాలు తీసుకుని.. భూనిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు.' -ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే
భాజపా ఝూటా పార్టీ కాదని.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రుణ మాఫీ.. అమలు చేయకపోవడమే కాకుండా విద్యుత్, బస్ ఛార్జీలను పెంచిన వారిదే ఝూటా పార్టీ అని ఈటల ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో జిల్లా భాజపా అధ్యక్షుడు రాంచందర్ రావు, భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: Harish Rao News: 'బస్తీలో సుస్తీ లేకుండా చేయడమే టార్గెట్'
Asani Cyclone Effect on AP : నేలరాలిన పంటలు.. తడిసిముద్దయిన ధాన్యం
ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని...