Minister Satyavathi visited Ekalavya Gurukul school: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేసి.. నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందిస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలులోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలను మంత్రి సత్యవతి తనిఖీ చేశారు. కలుషిత ఆహారం తిని కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని మంత్రి పరామర్శించారు.

సిబ్బందిపై ఆగ్రహం
పాఠశాలలోని భోజన సరుకులు, కూరగాయలు, బియ్యం తదితర వాటిని మంత్రి పరిశీలించి సమీక్షించారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇతర వసతులను పరిశీలించారు. వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలపై విచారణ చేపట్టి.. పొరపాటు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట కలెక్టర్ శశాంక, ఇతర అధికారులు ఉన్నారు.
ఏం జరిగిందంటే
రెండు రోజుల క్రితం గురుకుల విద్యార్థులు.. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండగా ఏఎన్ఎమ్లు మందులు ఇచ్చారు. మంగళవారం ఉదయం పాఠశాల ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవగా.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మంత్రి సత్యవతి రాథోడ్‌కు వివరించారు.
ఇదీ చదవండి: వనపర్తిలో విషాదం.. చెరువులో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి