బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లిలో వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి... ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరిపెడ మండలం తండధర్మారంలో మృతిచెందిన ఓ బాధిత కుటుంబాన్నీ పరామర్శించారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మంత్రి స్పష్టంచేశారు. పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల వంటి హామీలను అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు. రానున్న ఐదేళ్లలో గిరిజనులు, పేదలు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు