మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయం, శనిగపురంలోని అంగన్ వాడి కేంద్రంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా.. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా, మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో గురుకుల విద్యాలయాల్లోని సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఒక్కొక్క మొక్కను నాటి హరిత తెలంగాణ ఆశయంలో భాగం కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు వేదికలను ప్రారంభించి అన్నదాతలకు అందిస్తున్న సందర్భంగా రాష్ట్ర రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా పట్ల ఎంత ప్రేమ ఉందని చెప్పడానికి రైతు వేదిక ప్రారంభోత్సవానికి జనగామ కొడకండ్లను ఎంపిక చేయడమే నిదర్శనమని తెలిపారు.
ఈరోజు రాష్ట్ర రైతులకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణలో చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతుల తరఫున రైతుబిడ్డగా ముఖ్యమంత్రికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సత్యవతి రాఠోడ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి