కేంద్రం నుంచి రాష్ట్రానికి కొత్తగా ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని... వీటిలో 840 మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్ విద్య లభించనుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా, కొత్తగా మంజూరైన వాటిలో మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం, గూడూరు, ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెళ్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల, దుమ్ముగూడెం, ముల్కలపల్లి, ఖమ్మం జిల్లా సింగరేణిలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ. 33 కోట్ల చొప్పున రూ. 231 కోట్ల వ్యయాన్ని మంజూరు చేయనున్నట్లు సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గిరిజనుల విద్య కోసం ఏడు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కమ్యూనిటీ రెన్యూవల్ టీంకు కోత విధించకుండా మొత్తం రెన్యువల్ చేసుకునేందుకు ఆమెదం తెలిపడం పట్ల గిరిజనుల విద్యకు సీఎం ఇచ్చే ప్రాధాన్యత అర్థమవుతోందన్నారు. రెన్యువల్ అయ్యే సీఆర్టీలు బాగా పనిచేయాలని సత్యవతి రాఠోడ్ కోరారు.