కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, బాధితుల కోసం అదనపు పడకల ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రికి కావాల్సిన సౌకర్యాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు.
ఆక్సిజన్ అందుబాటు
తనకు కరోనా సోకడం వల్ల టీకా తీసుకోవడం ఆలస్యమైందని మంత్రి అన్నారు. టీకా పంపిణీ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. వచ్చే నెలలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తూ, మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నేటి నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌకర్యంతో పాటు మరో 28 పడకలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.
కొరత లేదు
రాష్ట్రంలో ఆక్సిజన్, మందులు, పడకలకు ఎలాంటి కొరత లేదని... ప్రజలు భయబ్రాంతులకు గురి కావొద్దని సూచించారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరాములు, ఆర్ఎంవో డాక్టర్ చింతా.రమేశ్, కొవిడ్ కోఆర్డినేటర్ డాక్టర్.రాజేశ్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: ఐదు గ్రామాల్లో కోలుకున్న 405 మంది కొవిడ్ బాధితులు