మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగున్నర తులాల బంగారు.. 44 తులాల వెండి ఆభరణాలు... రూ.14వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు.
గార్ల మండల కేంద్రానికి చెందిన చింత యుగేందర్ జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతూ గతంలో జైలు శిక్షను అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూ చోరీ చేసిన సొత్తును అమ్ముతూ పోలీసులకు చిక్కాడు.
పీక్లా తండాకు చెందిన భానోత్ పవన్ గాజా తండాలోని తన మేనమామ ఇంట్లో చోరీ చేసి.. చోరీ సొత్తును అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. నిందితులను పట్టుకునేందుకు కృషిచేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందించారు. కాలనీ వాసులు సంయుక్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.