అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని అతని కూతురు వివాహానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఆర్థిక సహాయాన్ని అందుకున్న ఆ వీరాభిమాని కన్నీటిపర్యంతమయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న బోనగిరి శేఖర్ 30 సంవత్సరాలుగా చిరు వీరాభిమాని. చిరంజీవి కొత్త సినిమా విడుదల ఉంటే చాలు... ఒకరోజు ముందు నుంచే హంగామా చేసేవాడు. చిరుకి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించినా శేఖర్ ముందుండేవాడు. తను పేదరికంలో ఉన్నా హీరో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా చిరంజీవికి అత్యంత ఆప్యాయత గల అభిమానిగా గుండెల్లో నిలిచిపోయాడు.
మిర్చి బండి నడుపుతూ శేఖర్ జీవనం సాగిస్తున్నాడు. పేదరికం కారణంగా కూతురు పెళ్లి చేయలేని స్థితిలో ఉండటంతో... ఈ విషయాన్ని తోటి అభిమానులు, యూత్ సభ్యులు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈఓ స్వామి నాయుడు సహకారంతో చిరు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి స్వామి నాయుడు.. శేఖర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఎవరు ఆపదలో ఉన్నా...
చిరంజీవి అభిమానులు ఎవరు ఆపదలో ఉన్నా తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటామని స్వామి నాయుడు పేర్కొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి రక్తం అందించామని, కరోనా సమయంలో 13 వేల మంది సినీ ఆర్టిస్టులకు సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
ఇదీ చదవండి: సింగరేణి బొగ్గు గనిలో పెద్దపులి సంచారం.. భయంలో జనం