2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత(MP Maloth Kavitha imprisonment)కు హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఆరు నెలల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించిన న్యాయస్థానం... జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పది వేల రూపాయల జరిమానా చెల్లించడంతో... హైకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు వీలుగా కవిత శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కవిత అనుచరుడి వద్ద డబ్బు స్వాధీనం
పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా మాలోత్ కవిత పోటీ చేశారు. ప్రచార సమయంలో మాలోత్ కవిత అనుచరుడు షౌకత్ అలీ వద్ద 9 వేల 400 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలోత్ కవిత, షౌకత్ అలీపై 2019లో ఐపీసీ 188, 171 బీ ప్రకారం కేసు నమోదు చేసిన బూర్గంపహాడ్ పోలీసులు... హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ 171 బీ కింద మాలోత్ కవిత, షౌకత్ అలీపై నేరాభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది. మాలోత్ కవిత మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె. ఇదే మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.
ఇదీ చదవండి: HIGH COURT: ఆర్ఎంపీ, పీఎంపీల పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశం