ప్రతిరోజు మన కళ్లెదుట చేసే వ్యవసాయ పనులు సులభతర పద్ధతిలో చేసేందుకు వీలుగా విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు అద్భుతమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రశంసించారు. రాష్ట్రస్థాయి ఇన్నోవేటర్స్ కార్యక్రమంలో దంతాలపల్లి మండలానికి చెందిన అభిషేక్, రాజేశ్, వేణులు రెండో స్థానంలో నిలిచారు.
విద్యార్థులకు మొమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసిన కలెక్టర్ గౌతమ్.. వారిని అభినందించారు. ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవాటుగా మార్చుకోవాలని, సమస్య ఎక్కడైతే ఉంటుందో... పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉంటుందని తెలిసే విధంగా ఆలోచనకు పదును పెట్టాలని సూచించారు.
విద్యార్థుల వెన్నంటి ప్రోత్సహిస్తున్న జిల్లా సైన్స్ టీచర్ అప్పారావు, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్రంలో 7093 ప్రదర్శనల్లో మొదటి రౌండ్లో 500 ఎంపిక కాగా, రెండో రౌండ్లో 125, మూడో రౌండ్లో 25 ఎంపిక అయ్యాయి. 25 లో బెస్ట్ మూడింటిలో రెండో స్థానాన్ని మహబూబాబాద్ జిల్లా విద్యార్థులు సాధించారు. వీరిని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు అభినందించారు.