కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. నూతన సాగు చట్టాలు కార్పొరేట్‌కు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్ష శ్రేణులు నిరసన చేపట్టాయి.
కార్పొరేట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పగించడానికే ఈ చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు. ఐదు సార్లు చర్చలు జరిగినా ఫలితం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతుంటే... రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. తక్షణమే ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని... లేదంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం!