Floods Effect in Telangana 2023 : రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలు.. అన్నదాతను అతలాకుతలం చేశాయి. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినా.. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇరువైపులా ఉన్న పంట పొలాలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో అమర్చిన మోటార్లు, స్టాటర్లు కొట్టుకుపోయాయని.. వరి నాట్లు వేసిన 10 రోజులకే వరదలు రావడంతో ఒక్కొక్క రైతు రూ.20 నుంచి రూ.30 వేల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 వేల ఎకరాలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
"ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం వాగుల పక్కనే ఉన్నాయి. ఒక్కొక్క రైతుకు ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు మాత్రమే పొలం ఉంటుంది. అంతకు మించి పెద్ద రైతులు లేరు. నాట్లు వేసి ఐదారు రోజులు మాత్రమే అవుతోంది. ఎప్పుడూ రానంతా వర్షాలు, వరదలకు పొలంలో అంతా ఇసుక మేట వేసింది. ఇప్పుడు మళ్లీ పొలం తిరిగి వేసుకోవాలనుకున్నా గానీ, నారు దొరికే పరిస్థితి లేదు. అదేవిధంగా ఒకవేళ ధైర్యం చేసి పంట వేద్దాం అనుకున్నా ఈ ఇసుకలో ట్రాక్టర్ నడవదు. ఎండాకాలం పంటకు మాత్రమే ఇప్పుడు ఈ భూమి పని చేసేలా ఉంది. పొలం మొత్తం శుభ్రం చేసి ఒక లెవల్‌కు తీసుకొస్తేనే నాట్లకు పని చేస్తుంది. కొంతమంది ఇవన్నీ వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు." -బాధిత రైతు
Crops Damage in Telangana 2023 : బయ్యారం మండలం ధర్మారావుపేట గ్రామ శివారులో జిన్నేల వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో.. ఇరువైపులా ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యాయి. 60 ఏళ్లలో ఇలాంటి నష్టం ఎప్పుడూ జరగలేదని రైతులు వాపోయారు. పది రోజుల క్రితం వరి నాట్లు వేయగా పూర్తిగా కోతకు గురై రాళ్లు తేలుతున్నాయన్నారు. దెబ్బతిన్న పొల్లాలో వేసవి దాకా మరో పంట పండించే అవకాశం లేదని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లాలో వరద ప్రవాహం తగ్గితే.. పంట నష్టం ఏ మేరకు జరగిందో తెలిసే అవకాశముందని.. వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామాల వారిగా నష్టాన్ని అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్న నేతలు.. సాయం అందిస్తామంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు.
"మాకు ఉన్న ఎకరం పొలంలో నాట్లు వేసిన మూడో రోజే మొత్తం కొట్టుకుపోయింది. పొలంలో ఉన్న నీళ్ల మోటారు కూడా ఆ వరదకు పోయింది. పెట్టుబడి పెట్టేశాం.. మళ్లీ ఇప్పుడు నాట్లు వేయాలంటే వేయలేక పోతున్నాం. నారు పోసుకొని అవి నాటాలంటే నెల సమయం పడుతుంది. నారు ఎదిగిన తర్వాత పొలంలోకి ట్రాక్టర్ రాదు. అప్పటికీ భూమి ఇసుకతో గట్టిపడిపోతుంది. ఇక ఈ భూమిలో ఎండాకాలం పంట వేసుకోవడమే." -బాధిత రైతు
ఇవీ చదవండి: