మహబూబాబాద్‌లో నకిలీ విత్తనాలు తయారుచేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని గుమ్మనూరులో దందా నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు, అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రూ.50 లక్షల విలువ చేసే ప్యాక్ చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తన ప్యాకెట్లు... ప్యాక్ చేయకుండా నిల్వచేసిన 33 బస్తాల విడి పత్తి గింజలను సీజ్ చేశారు.
బయ్యారంలో ఫర్టిలైజర్ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఓ వ్యాపారి, మేడ్చల్‌కు చెందిన మరో వ్యక్తి కలిసి ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీ ఎత్తున నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విడి గింజలను తీసుకొచ్చారు. గింజలకు రంగులు వేసి... పలు కంపెనీలకు చెందిన కవర్లలో ప్యాక్ చేశారు. గ్రామాల వారీగా ఏజెంట్లను నియమించుకుని ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించినట్లు వెల్లడించారు.