మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెరాస శ్రేణులు ఎమ్మెల్సీ ఓటర్లకు అల్పాహారం పెట్టి, డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో అడ్డుకునేందుకు భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఇందుకు నిరసనగా మహబూబాబాద్ ప్రధాన రహదారిపై భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. డబ్బులు పంచుతున్నారనే సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
తెరాస నాయకులు డబ్బులు పంచుతుండగా భాజపా కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రేమేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని... డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: మహబూబాబాద్‌లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ