Differences between leaders: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్‌లోని తహసీల్దార్ కార్యాలయం ముందు తెరాస చేపట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాఠోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయపడ్డాయి. నిరసన దీక్షలో భాగంగా.. మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షరాలు ఎంపీ కవిత ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో వచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. "నేను మాట్లాడాలి మైక్ ఇవ్వండి" అంటూ అడిగారు. "సభాధ్యక్షురాలిగా నేను మాట్లాడుతున్న కదా.." అని చెప్పిన కవితకు.. "నేను మాట్లాడాలి" అని డిమాండ్ చేస్తూనే ఆమె చేతిలో ఉన్న మైక్‌ను లాక్కున్నారు. సభలో అందరూ చూస్తుండగానే వేదికపై ఎమ్మెల్యే చేసిన పనికి అవాక్కవటం ఎంపీ కవిత వంతైంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని నిశ్శబ్దంగా ఉన్న కార్యకర్తలు.. "శంకరన్న నాయకత్వం వర్దిల్లాలి" అంటూ నినాదాలు చేశారు. ఇక చేసేదేమి లేక ఎంపీ కవిత కూర్చుండిపోయారు.
మరోవైపు.. మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రసంగించే సమయంలో.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అని సంబోధించారు. పక్కనే ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వెంటనే స్పందించి.. "అలా కాదు.. ఇది జిల్లా మీటింగ్ కాబట్టి.. పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన అనాలి" అని మంత్రికి సూచించారు. వెంటనే ఆ మాటను సవరించుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్.. జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన అని సంబోధిస్తూ.. ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ రెండు సంఘటనలతో.. జిల్లాలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డట్టయింది. లోపల ఎన్ని ఉన్నా.. ఇన్ని రోజులు బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డ నాయకులు.. ఈరోజు దీక్షలో జరిగిన పరిణామాలతో అవి కాస్తా బయటపడ్డాయని అందరూ భావిస్తున్నారు. ఇక ప్రజల్లో దీనిపై ఆసక్తికర చర్చకు తెరలేసింది. మరోవైపు తహసీల్దార్ కార్యాలయ గేటుకు అడ్డంగా తెరాస రైతు దీక్ష చేపట్టడం వల్ల కార్యాలయానికి వచ్చే వారు, రహదారిపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిబంధనల్ని ప్రతిపక్ష పార్టీలకేనా.. అధికార పార్టీకి ఈ నిబంధనలు వర్తించవా..? అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదీ చూడండి: