RS Praveen kumar: ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 8 ఏళ్లుగా కాలయాపన చేస్తూ.. ప్రజలతో చెలగాటమాడుతున్నారని సీఎంపై బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కాన్షీరామ్ 88వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా..
'బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత 10రోజులుగా రాజ్యాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారికి కన్నీళ్లు మిగిల్చింది. దళితబంధును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులకు మాత్రమే పథకాన్ని అమలు చేస్తూ అసలైన దళితులు లబ్ధి పొందకుండా చేస్తున్నారు. రైతుబంధు ద్వారా భూస్వాములు మాత్రమే కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. సన్నకారు, కౌలు రైతులకు మాత్రం పథకం ద్వారా ఎలాంటి లాభం చేకూరట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 11,000 మాత్రమే రెగ్యులరైజ్ చేస్తానని చెప్పడం ఏంటి?.'
-ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త
ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసమే 80 వేల ఉద్యోగాలు వేస్తామని ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వాటికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్..