Bird lover in mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీలో నివాసం ఉంటున్న అంజద్కు చిన్నప్పటి నుంచి పక్షులంటే అమితమైన ప్రేమ. చిన్నతనంలో ఉన్నప్పుడు వాటి కిలకిలరావాలను ఆస్వాదిస్తూ.. ఆనందించేవాడు. రంగురంగుల పిట్టలను చూసి మురిసిపోయేవాడు. పెరిగి పెద్దయ్యాక.. నాలుగు డబ్బులు సంపాదిస్తున్న సమయంలో తనకున్న మక్కువతో పక్షులను సొంతంగా పెంచుకోవాలనుకున్నాడు. పుణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ జాతికి చెందిన పది జతల పక్షి పిల్లలను కొనుగోలు చేసి పెంచుకోసాగాడు. కొన్ని రోజులకే కరోనాతో లాక్డౌన్ విధించడం, వర్క్ ఫ్రం హోం ఉండటం వల్ల.. అక్కడి నుంచి సొంత నివాసానికి ఆ పక్షి పిల్లలతో సహా చేరుకున్నాడు.
ఏమాత్రం సమయం దొరికినా వాటితోనే..
తన సొంత ఇంటికి వచ్చాక తన పక్షులను ఇంకా సౌకర్యవంతంగా.. చూసుకోవటం సాధ్యమైంది అంజాద్కు. తన పక్షులకు ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించాడు. రోజూ వాటిని దాణా వేయటం.. మంచి నీళ్లు పెట్టడమే కాకుండా.. అవి నలతగా ఉంటే మందులు కూడా ఇస్తూ ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. అంజద్ ఇంటి వద్ద లేని సమయంలో తల్లి, సోదరులు, సోదరుడి పిల్లలు వాటిని చూసుకుంటారు. ఆ ఇంటి వారంతా అలసిపోయినా.. ఏమాత్రం సమయం దొరికినా.. పక్షులతోనే కాలక్షేపం చేస్తూంటారు. అవి చేసే సందడికి పిల్లలు మురిసిపోతారు. వారి స్నేహితులు, ఇరుగుపొరుగు వారంతా కూడా ఈ పక్షుల వద్దకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు.
పది జతలతో ఇంటికి వచ్చిన ఆ పక్షులు ఇప్పుడు సుమారు నాలుగు వందల జతలయ్యాయి. వీటి కోసం ప్రతి నెలా.. 6 నుంచి 7 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు మన పక్షి ప్రేమికుడు. వాటికి ఇష్టమైన కొర్రలు, గోధుమలు, మక్కలతో పాటు పాలకూర, కొత్తిమీర, పుదీనా లాంటి సాఫ్ట్ఫుడ్ను కూడా ఇస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా.. వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు.
వాటి కాలక్షేపం చేస్తే చాలు..
"చిన్నతనం నుంచే నాకు పక్షులంటే ఇష్టం. నా భార్యకు కూడా ఆసక్తి. మా ఇంట్లో వాళ్లు కూడా నా ఇష్టానికి గౌరవమిచ్చి సపోర్ట్ చేస్తున్నారు. పది జతలతో మొదలై... ఇప్పుడు ఏకంగా నాలుగు వందల జతలయ్యాయి. వాటికి ఇష్టమైన ఆహారం ఇస్తుంటాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. మాలో ఎవరికైనా.. మనసుకు బాధ కలిగితే.. వాటితో కాసేపు కాలక్షేపం చేస్తే చాలు అంతా మర్చిపోతాం. వాటి కిలకిల రావాలు వింటూ.. చాలా ఎంజాయ్ చేస్తుంటాం. నేను లేని సమయంలో నా భార్యకానీ.. మా అన్నయ్య, వాళ్ల పిల్లలు ఇలా అందరూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు." - అంజద్, పక్షిప్రేమికుడు
రేడియేషన్ ప్రభావం వలన అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని అంజాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. రానున్న రోజుల్లో పక్షి జాతులు కనుమరుగైపోకుండా ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పక్షులను పెంచుకుంటే భావితరాలకు వాటిని అందించినవారవుతామని అభిప్రాయపడుతున్నాడు.
ఇవీ చూడండి: