ఓ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురంలో మద్యం విక్రయించడం, సేవించడం రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఇప్పటి వరకు గ్రామస్థులెవరు ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించలేదు.
గొడవలు పడేవారు
గతంలో గ్రామంలోని యువకులు, మధ్య వయస్కులు నిత్యం మద్యం సేవిస్తూ పలు సందర్భాల్లో గొడవలు పడేవారు. మద్యం సేవించి పలువురు మరణించారు. గ్రామస్థులంతా ఒకచోట సమావేశమై గ్రామంలో సంపూర్ణంగా మద్యపానంను నిషేధించాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఎవరూ కూడా గుడుంబా, మద్యం విక్రయించరాదని తీర్మానం చేసుకున్నారు. ఆ నియమాలను ఉల్లంఘించిన వారికి 10 నుంచి 30 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఆ నిబంధనను గ్రామంలో ఎవరూ ఉల్లంఘించ లేదని గ్రామపెద్ద బిజ్జా నరసింహారావు తెలిపారు.
ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా..
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుతో గ్రామంలో ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని.. ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి ఒక్కరు కూడా పోలీస్స్టేషన్ మెట్లను ఎక్క లేదన్నారు. చిన్న చిన్న తగాదాలు ఉంటే గ్రామంలోనే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. గ్రామంలోని యువత సంపూర్ణ మద్యపాన నిషేధం ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షిస్తుంటారని అన్నారు. వర్షాకాలంలో వట్టి వాగు పొంగి ప్రవహించడం వల్ల ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయని.. దానిపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఈ గ్రామం మాదిరిగా పయనిస్తే గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం కల నెరవేరే అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి : ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కాకతీయ జంతు ప్రదర్శనశాల