తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో చోటు చేసుకుంది. భర్త కుటుంబం నుంచి తనకు న్యాయం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్‌కు చెందిన మౌనికకు దాట్లకు చెందిన సాయితో గతేడాది వివాహమైంది. కొద్ది రోజుల పాటు వీరి సంసారం బాగానే సాగినా..అనంతరం విభేధాలు తలెత్తాయి. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ సైతం నిర్వహించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
దీంతో వీరి పంచాయితీ గతంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అనంతరం సాయి కోర్టుకు వెళ్లడంతో వీరి పంచాయితీ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలోనే మౌనికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు భర్త సాయి ఇంటికి రావడంతో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో తనకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ మౌనిక గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇరువురి కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్సై మురళీధర్‌రాజు తెలిపారు.
ఇదీ చూడండి: