మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన దేశబోయిన నాగరాజు-శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె తర్వాత హర్షవర్ధన్ చిన్న కుమారుడు. ఆరు నెలల వయసు నుంచి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు.
మొదట్లో జ్వరం, ఫిట్స్ రావడంతో స్థానికంగా వైద్య చికిత్స చేయించినా తగ్గకపోవడంతో పాటు సమస్య అధికమవడంతో హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా లివర్ సమస్య ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లివర్ మార్చడమే పరిష్కారమని వైద్యులు తేల్చడంతో పేద కుటుంబానికి చెందిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బాలుడి తండ్రి నాగరాజు మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కుమారుడిని కాపాడుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. అందిన దగ్గర అప్పలు చేసి వైద్యం అందిస్తున్నా బాలుడికి సమస్య తీవ్రమవుతుండటంతో నరకయాతననుభవిస్తున్నాడు.
లివర్ మారుస్తేనే తప్పా సమస్య తీరేలాలేదు. దీనికి గాను రూ.20 లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యలు తెలిపినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. కళ్లముందు సరదాగా గడపాల్సిన బిడ్డ అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బాలుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడికి ప్రాణం పోసేందుకు లక్షలు ఖర్చు చేసే స్థోమత తమకు లేదని దాతలు, ప్రభుత్వం స్పందించి తమ బిడ్డను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
గమనిక: దాతలు ఆర్థికసాయం అందించాల్సిన బాలుడి తండ్రి నాగరాజు గుగూల్‌పే నెంబర్ 9703272779.