Vattivagu Reservoir shrinking : ఒకప్పుడు పాతికవేల ఎకరాలకు నీరందించిన వరప్రదాయిని క్రమక్రమంగా ‘వట్టి’పోతోంది. జలాశయంలో బొగ్గు వ్యర్థాలు చేరడం, నీటిని తెచ్చే కాలువను పదేపదే మార్చడంతో ఇప్పుడు 1,000 ఎకరాల ఆయకట్టు మాత్రమే కనాకష్టంగా సాగవుతోంది. సింగరేణి ఉపరితల గని విస్తరణ అక్కడ అన్నదాతల పాలిట శాపంగా మారింది. అధికారుల నిష్క్రియాపరత్వం కారణంగా కుమురంభీం జిల్లా వట్టివాగుపై నిర్మించిన జలాశయం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గని తవ్వకాల్లో వెలువడే బొగ్గు వ్యర్థాలను పక్కనే కొండల్లా నిల్వ చేస్తున్నారు. వర్షాలకు అది జలాశయంలోకి చేరి నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది. దీంతోపాటు శిథిల కాలువలు, విరిగిన షట్టర్లు, పూడుకుపోయిన తూముల కారణంగా అతి కష్టం మీద 1000 ఎకరాలకే సాగునీరు అందిస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏటా అన్నదాతలే తలాకొంత పోగు చేసుకుని కాలువల్లో పూడికను తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో 1977లో వట్టివాగు జలాశయ పనులు ప్రారంభం కాగా రూ. 120 కోట్లు ఖర్చుతో 1998లో పనులు పూర్తయ్యాయి. దీని సామర్థ్యం 2.89 టీఎంసీలు కాగా మొదట్లో దాదాపు 25 వేల ఎకరాలకు నీరందింది. జలాశయం పక్కనే 2005 సంవత్సరంలో కైరిగూర ఉపరితల గనికి అడ్డుగా ఉందని తిర్యాణి మండలంలోని చెలిమెల ప్రాజెక్టు మత్తడితోపాటు మార్గమధ్యలోని కొండ ప్రాంతాల్లో అనేక వాగులను కలుపుకొని వట్టివాగులోకి నీటిని తెచ్చే కాలువను దారి మళ్లించారు. ఇప్పటి వరకు 5.66 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. తాజాగా ఈ ఉపరితల గనిని మరో 29.09 హెక్టార్ల మేర విస్తరించనున్నారు. ప్రస్తుతం గని తవ్వకాలు వట్టివాగు జలాశయానికి నీరు తెచ్చే ప్రధాన నీటి వనరు సమీపంలోకి చేరుకున్నాయి. అంతకుమందు సహజ మార్గాన్ని మార్చేసిన అధికారులు తాజాగా మళ్లీ మార్చడానికి కాలువ మూసివేసి, కిలోమీటరున్నర దూరంలో మరో మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
* వట్టివాగు కాలువ మళ్లింపు కోసం ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారని నీటిపారుదల డీఈ ఆనంద్ పేర్కొన్నారు. కోల్‌డంప్ వ్యర్థాలు వట్టివాగుతోపాటు, ఉల్లిపిట్ట గ్రామంలోకి వెళ్లకుండా ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి బెల్లంపల్లి జీఎం సంజీవరెడ్డి తెలిపారు.
కోల్‌డంప్‌తో కోలుకోలేని నష్టం..
బొగ్గు తవ్వకాల్లో వచ్చే వ్యర్థాలను వట్టివాగు జలాశయం పక్కనే పోస్తున్నారు. భారీ వర్షాలకు అవి జలాశయంలో కలుస్తున్నాయి. సమీపంలోని ఉల్లిపిట్ట గ్రామంలోకి సైతం చొచ్చుకుపోతున్నాయి. వర్షకాలం వారి వెతలు వర్ణానాతీతం. 450 జనాభా ఉన్న ఈ గ్రామాన్ని అధికారులు పునరావాస గ్రామంగా కూడా గుర్తించలేదు. కోల్‌డంప్ కొండల చుట్టూ సిమెంట్ గోడ నిర్మిస్తామని చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు.
ఇదీ చదవండి: KTR TOUR: నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన