కుమురం భీం జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఎస్‌ఐలపై జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ వేటు వేశారు. అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ఎస్ఐలను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో ఇద్దరు ఎస్ఐలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం చర్చకు దారితీసింది.
ఆయనపై అందుకే సస్పెన్షన్...
గత నెల 12న చింతలమనేపల్లి మండలంలో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాన్ని హెడ్ కానిస్టేబుల్ మెంగరావు వదలిపెట్టడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. తనపై అధికారుల ఆదేశాల మేరకే తాను ఆ వాహనాన్ని వదిలిపెట్టానన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి...
ఈ కేసులో అన్యాయంగా తనను సస్పెండ్ చేశారని హెడ్ కానిస్టేబుల్ మెంగరావు ఆవేదన వ్యక్తం చేస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ కుమురం భీం జిల్లా ఏఎస్పీ సుధీంద్రకు విచారణ బాధ్యతలు అప్పగించారు.
విధుల్లో నిర్లక్ష్యం...
విచారణ అనంతరం చింతలమనేపల్లి ఎస్ఐ రామ్మోహన్‌ను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిర్పూర్ (టి) ఎస్ఐ వెంకటేశ్ సైతం విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం. చింతలమనేపల్లి ఎస్ఐ రామ్మోహన్‌కు ఇదే మొదటి నియామకం కావడం గమనార్హం. వీరి స్థానాల్లో ఇంకా ఎవరిని నియమించలేదు పోలీసులు పేర్కొన్నారు.