కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన పెద్దపులి మళ్లీ తిరిగి వచ్చింది. పదిరోజుల క్రితం పెంచికలపేట అటవీ ప్రాంతంలో మూడు పశువులను హతమార్చింది. నాలుగు రోజుల క్రితం బెజ్జూరు మండలం కుకుడ అటవీప్రాంతంలో మరో పశువును హతమార్చింది. తాజాగా గురువారం అర్ధరాత్రి సమయంలో పెంచికలపేట మండలం గుండెపల్లి గ్రామంలో సంచరింది. గెడం పోచయ్య అనే రైతు ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న పశువుపై దాడి చేసింది. పులిని చూసి పశువులు బెదరడంతో మేల్కొన్న యజమాని, స్థానికులు కేకలు వేయడంతో పశువును వదిలేసి పారిపోయింది. పశువుకు తీవ్రగాయాలయ్యాయి.
అటవీప్రాంతంలో ఉండే పులి గ్రామంలోకి వచ్చి పశువుపై దాడి చేయడం వల్ల గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి గ్రామాల్లోకి దాడులు చేస్తుంటే ఎలా బతికేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించారు. వరుస దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న పులిని ఎప్పుడు బంధిస్తారని స్థానికులు అధికారులను నిలదీశారు. పులిని బంధించాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా కలకలం..