ETV Bharat / state

ఆగని పెద్దపులి వేట.. బెంబేలెత్తిస్తున్న వరుస దాడులు

author img

By

Published : Dec 17, 2020, 12:52 PM IST

అందరూ చూస్తుండగానే పులి తన వేటను కొనసాగించింది. బెబ్బులిని చూసి జనం పరుగులు తీస్తుండగా అది నింపాదిగా ఆవును చంపింది. భీంపూర్‌ మండలంలో రెండు రోజుల కిందట తాంసి-కె శివారులో లేగదూడను హతమార్చిన పులి.. బుధవారం ఉదయం పూట మరో ఆవును గొల్లఘాట్‌ శివారులో వేటాడింది. తాజా ఘటన పంటచేల సమీపంలో.. రోడ్డున పోయే వారు చూస్తుండగా జరగడం కలకలం రేపింది.

ఆగని పెద్దపులి వేట.. బెంబేలెత్తిస్తున్న వరుస దాడులు
ఆగని పెద్దపులి వేట.. బెంబేలెత్తిస్తున్న వరుస దాడులు

రెండు రోజుల వ్యవధిలో కిలోమీటరు సమీప గ్రామాల్లో పులి వరుస దాడులు పరిసర గ్రామస్థులను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఘటనా స్థలాన్ని ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో చంద్రశేఖర్‌ సందర్శించి రైతులు, గ్రామస్థులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెబుతూ ప్రత్యేక అటవీబృందం గ్రామంలోనే ఉండి గస్తీ తిరుగుతుందని భరోసానిచ్చారు. పులి చంపిన ఆవు మండలంలోని గుంజాల గ్రామవాసి మడావి ఉత్తమ్‌దిగా గుర్తించారు. పులి వరుస దాడులతో పెన్‌గంగా నదికి ఆనుకుని ఉన్న గొల్లఘాట్‌, తాంసి-కె, పిప్పల్‌కోటి, నిపాని, గుంజాల గ్రామస్థులు తమ పంటచేలకు వెళ్లేందుకు జంకుతున్నారు. బుధవారం ఘటనకు సమీపంలోని పంటచేలలో పనిచేస్తున్న కూలీలు విషయం తెలిసి భయంతో పరుగు తీశారు. పశువుల కాపరులు రోడ్డున్న పరిసరాల్లో చెట్టెక్కి కూర్చున్నారు.

తిప్పేశ్వర్‌ నుంచి పులుల రాక

మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగా నదికి అవతల తిప్పేశ్వర్‌ అభయారణ్యం విస్తరించింది. అక్కడ పులుల సంఖ్య 20కిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పులుల సంఖ్య పెరగడంతో తమ ఆవాసాన్ని విస్తరించుకునే క్రమంలో మూడేళ్లుగా పెన్‌గంగా నదికి ఆనుకుని ఉన్న భీంపూర్‌ మండలంలోని తాంసి-కె, గొల్లఘాట్‌, గుబిడి, కరంజి-టి, కరణ్‌వాడి, గోముత్రి, అంతర్గాం, అర్లి-టి, వడూర్‌ పరిసరాల్లో పులులు రావడం పశువులపై దాడులు చేసి హతమార్చడం సాధారణమైపోయింది. గతంలో పెన్‌గంగా ప్రవాహ ఉద్ధృతి తగ్గాక వేసవికాలంలో పులుల సంచారం ఎక్కువగా ఉండేది. ఈసారి రెండు నెలల ముందే పులులు ఇటువైపు రావడం భయాందోళనకు కారణమవుతోంది. ఇపుడిపుడే పత్తి చేతికొస్తున్న తరుణంలో పులి భయంతో పంటచేలకు వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో చేతికొచ్చిన పంటను చేలలోనే వదిలేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తుండగా.. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పులిదాడుల్లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసి స్థానికుల్లో మరింత భయం కనిపిస్తోంది. లేగదూడను, ఆవును హతమార్చింది ఒకటే పులా.. లేకా రెండా అనేది అటవీ అధికారులు తేల్చలేకపోతున్నారు. రెండు ఘటనలు కిలోమీటరు దూరం కలిగిన పరిసరాల్లో చోటు చేసుకోవడంతో అధికారులు ఒకే పులిగా భావిస్తున్నప్పటికీ.. గొల్లఘాట్‌ గ్రామస్థులు మాత్రం రెండు పులులు సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. లేగదూడ హతమార్చిన చోట కెమెరాకు పులి చిక్కిడం.. బుధవారం హతమైన ఆవు వద్ద కూడా కెమెరాలు బిగించారు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు బట్టి ఒకటా? రెండా? అన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

గ్రామస్థుల తోడుగా విధులకు

పులి సంచారం మూడేళ్లుగా ఉంటోంది. పులి దాడులు మొదలయ్యాయంటే పాఠశాలకు వెళ్లాలంటే భయమేస్తుంది. బడికి వెళ్లేటపుడు, తిరుగుపయనమయ్యేటపుడు గ్రామస్థులు తోడుగా వెంట వస్తున్నారు. గ్రామానికి వెళ్లేదారి అటవీ పరిసరాల్లో ఉండటంతో ఎటువైపు నుంచి పులి వస్తుందో.. ఎక్కడ దాడి చేస్తుందోననే భయం వెంటాడుతుంది. బెజ్జూరు ఘటన నుంచి పులి అంటేనే మరింత వణుకుపుడుతోంది. - అశోక్‌, ప్రధానోపాధ్యాయుడు, గొల్లఘాట్‌.

రైతులకేది రక్షణ?

కుటుంబం గడవాలన్నా పంచేలకు వెళ్లక తప్పదు. పులి దాడి చేసిందని తెలిసినా పనులు చేసుకోక తప్పడం లేదు. పశువులు మరణించినపుడు అటవీ అధికారులు వచ్చి పరిహారం ఇచ్చి వెళ్తున్నారే గానీ.. పులి నుంచి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. పశువులు సరే మనుషులు చనిపోతే ఎలా? వారి కుటుంబాలు ఆదుకునేదెవరు? మనుషుల ప్రాణాలు పోకముందే తగు చర్యలు తీసుకోవాలి. - నాగోరావు, రైతు, గొల్లఘాట్‌.

ఒంటరిగా వెళ్లొద్దు

పులి సంచారం ఉన్నచోట రైతులు, ప్రజలు ఒంటరిగా తిరగొద్ధు ఉదయం, రాత్రి వేళల్లో పులి కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 5 గంటల తర్వాత పంటచేలలో ఉండొద్ధు పంటచేలకు వెళ్లినపుడు గుంపులుగా, చప్పుడు చేస్తూ ఉంటే జనసంచారం ఉన్నవైపు పులి రాదు. సాధారణంగా మనుషులపై పులి దాడి చేయదు. ఒకవేళ పులి తారసపడినా పరుగులు పెట్టకుండా దానివైపు చూస్తూ వంగకుండా వెనక్కి నడవాలి. ఒకవేళ వంగితే మాత్రం పశువుగా భావించి దాడిచేసే ప్రమాదం ఉంది. - చంద్రశేఖర్‌, ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ.

సంబంధిత కథనాలు: క్షణక్షణం భయం భయం... రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పులి గిలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.