మావోయిస్టు కదలికలపై పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా మకాం వేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి... అధికారులు, సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. వారితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. డీజీపీ మరో రెండు రోజుల పాటు పరివాహక ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో తీరప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు నెలకొన్న నేపథ్యంలో డీజీపీ క్షేత్ర స్థాయి పర్యటన చర్చనీయాంశంగా మారింది. గత జులైలో ఆయన తొలివిడతగా ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం ప్రాంతాల్లో రెండు రోజులపాటు పర్యటించారు. 45 రోజుల్లోనే తిరిగి ఆయన ఆసిఫాబాద్‌లో మకాం వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అడవుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు నేతృత్వంలోని బృందం గత నాలుగు నెలలుగా సంచరిస్తుందనే సమాచారం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ విస్తృతం చేశాయి.
సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు..
ఈ నేపథ్యంలో నాలుగు నెలల కాలంలో మూడు దఫాలుగా ఎన్‌కౌంటర్లు తప్పినట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండో విడత క్షేత్ర స్థాయి పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టుల కదలికలకు చెక్‌పెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నతాధికారులు వ్యూహరచనలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ ఐపీఎస్‌లకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు.
డీజీపీ పర్యటనలో ఉండగానే..
వరంగల్ ఐజీ నాగిరెడ్డి, ఆసిఫాబాద్ ఇంచార్జ్ కమిషనర్ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలో నిమగ్నమయ్యారు. మరోవైపు డీజీపీ పర్యటనలో ఉండగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ సభ్యుడు మృతిచెందడం కలకలం రేపింది.
ఎత్తుగడలపై శిక్షణ..
మరో వైపు పోలీసు శాఖలో కొత్తగా చేరి.. ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై పెద్దగా అవగాహన లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మావోయిస్టుల కదలికలు కనిపించినప్పడు ఎటువంటి వ్యూహం అమలు చేయాలి, మావోయిస్టుల వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎత్తుగడలు, వంటి అంశాలపై వీరికి అవగాహన తక్కువుగా ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పునఃశ్చరణ తరగతులు నిర్వహించే యోచనలో ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది.
ఇవీచూడండి: రెండో రోజూ పోలీస్‌బాస్ మకాం... పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ