కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో రెండురోజుల క్రితం పులి దాడిలో మరణించిన నిర్మల కుటుంబాన్ని... ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. బాధిత కుటుంబానికి అటవీశాఖ తరపున పరిహారంగా రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. నిర్మల కుటుంబంలో ఒకరికి అటవీశాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు అంగీకారం తెలిపినట్టు వెల్లడించారు.
బాలికను హతమార్చిన పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. 20 రోజుల వ్యవధిలో పులి ఇద్దరిని హతమార్చినందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి మరింత పరిహారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి... మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పులిని బంధించడానికి ఏర్పాటు చేసిన బోన్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శాంతారాం, కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్, రేంజ్ ఆఫీసర్లు వేణుగోపాల్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'తెలంగాణలో ఇంటికి 10వేలు ఇస్తుంటే.. ఏపీలో ఎకరానికి పదివేలేనా..'