ఇది బెజ్జూర్ మండలంలోని కుశ్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిల్వ ఉన్న నాలుగు క్వింటాళ్ల బియ్యం. గదిలో సంచులు తేమకు గురై చెడిపోతు న్నాయి. బియ్యం ముక్క వాసన వస్తూ గడ్డకడుతున్నాయి.
చింతలమానెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బియ్యం నిల్వలు ఎలుకలు, పురుగులకు ఆహారంగా మారుతున్నాయి. పురుగుపట్టి బియ్యం ముద్దలుగా మారుతున్నాయి.
జిల్లాలో ఉన్న ఆదర్శ పాఠశాలలు, కసూర్బా విద్యాలయాలు, ప్రాథమిక, జడ్పీ, ఉన్నత పాఠశాలల్లోని బియ్యం నిల్వలు పాడవుతున్నాయి. మార్చిలోనే బడులు మూతపడగా.. బియ్యం సంచులు ఆరేడు నెలల నుంచి వంట గదుల్లో ఉంటున్నాయి. కొన్నిచోట్ల సంరక్షణ చర్యలు చేపడుతున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో ఉన్న నిల్వలతో పాటు, ఇతర సామగ్రిని లాక్‌డౌన్ సమయంలోనే పాలనాధికారి సందీప్‌కుమార్ ఝా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో 4025 కొలాం గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 15 మండలాలు ఉండగా, ప్రతి మండలంలో 50 నుంచి 60 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉన్నాయి.
విద్యార్థుల ఇంటికి ఇస్తే ప్రయోజనం
ప్రస్తుత సమయంలో పాఠశాలలకు విద్యార్థులు ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశాలు లేవు. ఈ తరుణంలో ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న విద్యార్థుల ఇంటికే బియ్యం అందిస్తే నిరుపేద చిన్నారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇంటి వద్దకే వెళ్లి అంగన్‌వాడీ కార్యకర్తలు సరకులు అందజేస్తున్నారు.
జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు: 908
మాధ్యమిక ఉన్నత పాఠశాలలు: 180
ప్రాథమికోన్నత పాఠశాలలు: 170
విద్యార్థుల సంఖ్య: 88,119
పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యం: 868.11 క్వింటాళ్లు