కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సోయంగూడలో మంచినీటి సమస్యను పరిష్కరించారు పోలీసులు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా బోరు వేయించి ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చారు. వాంకిడి మండలం వెలిగి గ్రామపంచాయతి పరిధిలో గల సోయంగూడతో సీఐ సుధాకర్, ఎస్సై దీకొండ రమేశ్ పర్యటించారు.
ఇరవై రోజుల క్రితం సోయంగూడలో పోలీసులు సందర్శించినప్పుడు తమకు నీటి సమస్య ఉందని వారి దృష్టికి తెచ్చారు. తాగు నీటి కోసం వాగు నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని తమ గోడును విన్నవించుకున్నారు. దీంతో బోరు వేయిస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.
పోలీసులకు సమాచారం ఇవ్వండి
గ్రామాల్లో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో ప్రజలు గడిపేలా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా పెట్టామని.. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మనోహర్, గ్రామ పటేల్ బారక్ రావ్ , గ్రామస్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.