కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సిర్పూర్ నియోజకవర్గ భాజపా నాయకులు పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా లైఫ్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హరీష్ బాబును అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకుని సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్కు తరలించారు. గతవారం పెంచికలపేట మండలం కొండపల్లిలో పోడు భూముల సమస్య పరిష్కరించాలంటూ పాల్వాయి హరీష్ బాబు స్థానిక పోడు రైతులతో కలిసి నిరవధిక దీక్ష చేపట్టారు.
దీక్ష చేపట్టిన మూడో రోజున అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష భగ్నం చేశారు. దీక్షా శిబిరం వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఈఘటనలో హరీష్ బాబుకు పక్కటెముక విరగగా.. ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు... శనివారం అర్ధరాత్రి సమయంలో హరీష్ బాబుతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్ పరీక్షల అనంతరం సిర్పూర్(టి) న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వాయి హరీష్ బాబును అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. పోలీస్ సిబ్బందిపై దాడి చేసి తప్పించుకుపోయిన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు.
ఇదీ చదవండి: పాల్వాయి హరీశ్ బాబు అరెస్టు అప్రజాస్వామికం: బండి సంజయ్