కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ నిర్మాణానికి సిర్పూర్ ఎమ్మెల్యే కొనేరు కోనప్ప, జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ పనులు ప్రారంభించారు. వినియోగదారుల సౌకర్యార్థం ఆధునిక పద్ధతిలో మార్కెట్ నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా.. గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ. 7కోట్ల 50 లక్షల నిధులు కేటాయింపు...
కాగజ్ నగర్ పట్టణంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఇందిరా మార్కెట్ ప్రాంతం సరిపోవడం లేదు. ప్రస్తుత అవసరాలకు సరిపోయే విధంగా ఆధునిక పద్ధతిలో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు ప్రారంభించారు. పట్టణంలోని ఆదర్శ నగర్ 10,11 వార్డు పరిధిలోని 90 నంబర్ సర్వేలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సమీకృత మార్కెట్ నిర్మాణానికి కేటాయించారు. ఈ సముదాయానికి ప్రభుత్వం రూ. 5కోట్ల 50 లక్షల నిధులు, పురపాలిక నుంచి రూ. 2 కోట్లు, మొత్తం రూ.7కోట్ల 50 లక్షల నిధులు కేటాయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు, పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, పలువురు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వైద్యులకు రక్షణ కల్పించాలని మోదీకి ఐఎంఏ లేఖ!