సిర్పూర్ నియోజకవర్గంలోని పేదలకు కనీసం ఒక్కపూటైన భోజనం పెట్టాలనే దృఢ సంకల్పంతో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే నిత్యాన్నదానం షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతులు భూమి పూజ చేశారు. కొవిడ్ వల్ల ఈ కార్యక్రమం కొద్దిరోజులు వాయిదా పడిందని... త్వరలోనే పునఃప్రారంభం చేయనున్నామని పేర్కొన్నారు.
అన్ని సదుపాయాలతో...
స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా కేటాయించినట్లు ఎమ్మెల్యే కోనప్ప తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలనే షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. కాగజ్ నగర్ పట్టణానికి నియోజకవర్గంలోని ప్రజలు నిత్యం వేలాది మంది వస్తుంటారని... వారు ప్రశాంత వాతావరణంలో భోజనం చేసేలా సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ, వారి కుటుంబ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు