జిల్లాలోని ప్రాజెక్టుల కింద చివరి ఎకరాకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆత్రం సక్కు రైతులకు హామీ ఇచ్చారు. కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా తుంపల్లి పంచాయతీ పరిధిలోని చెరువును ఆయన పరిశీలించారు. గ్రామ పరిధిలోని పులి ఒర్రె చెరువు పూడికతీత పనుల కోసం రూ.18 లక్షలపై పాలనాధికారితో చర్చించి నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు.
రైతుల ఆవేదన:
పులి ఒర్రె చెరువు కింద 850 ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో నిర్మించిన ఒక ఎకరానికి నీరందడం లేదు. ఆయకట్టు కింద ఏ ఒక్క రైతు బాగు పడలేదని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే
జిల్లాలోని వట్టి వాగు, కుమురం భీం, ఎన్టీఆర్ సాగర్, అమ్మనమడుగు ప్రాజెక్టులతో పాటు పలు చెరువుల అసంపూర్తి నిర్మాణాలు, నిర్వహణ లేక లక్ష్యం మేరకు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. మరమ్మతులు, అవసరమైన నిధుల మంజూరు కోసం ఇటీవలే ముఖ్యమంత్రిని కలిశానని జిల్లాలోని అన్ని జలాశయాలపై సమగ్ర నివేదికను సీఎంకు నివేదిస్తామని ఆత్రం సక్కు హామీ ఇచ్చారు.
ఆందోళనకు దిగుతాం: రైతులు
చెరువుకు త్వరలో మరమ్మతులు చేయకుంటే జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని రైతులు పేర్కొన్నారు. చెరువు నిర్మాణంతో ప్రయోజనం ఉంటుందనే భూములు త్యాగం చేశామని అన్నారు. ఇప్పటికీ కొందరి రైతులకు నష్ట పరిహారం అందలేదన్నారు. రూ.15.90 కోట్లతో నిర్మించిన చెరువుతో ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున యాదవ్, సర్పంచ్ వరలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చిన్న మల్లన్న, మాజీ ఎంపీపీ బాలేశ్వర గౌడ్, నీటిపారుదల శాఖ ఈఈ గుణవంత రావు, ఏఈ నవ్య, తెరాస నాయకులు, రైతులు హాజరయ్యారు.