ప్రతి కార్యకర్తకు తెరాస ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కార్యకర్తల బీమా సౌకర్యం కోసం ఏటా రూ.16 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటా వివరిస్తూ సభ్యత్వం పొందేలా చేయాలని సూచించారు.
బలోపేతం చేయాలి..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన జరిగిన తెరాస సభ్యత్వ నమోదులో మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 80 శాతం సభ్యత్వం పూర్తి కావడం అభినందనీయమన్నారు. మార్చిలో బూత్, గ్రామ, మండల కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సభ్యత్వాలు ఈనెల 28 లోపు పూర్తి చేయాలన్నారు. వారానికోసారి పర్యటించి సమస్యలు తెలుసుకుని.. అభివృద్ధికి నిధులిచ్చేలా చూస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఏకలవ్య గురుకుల పాఠశాల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సహనం కోల్పోతే..
ప్రజల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. సీఎంపై భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఏకవచన వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కార్యకర్తలు సహనం కోల్పోతే వారిని బయట తిరగనివ్వరని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విలువ రూ.65 వేల కోట్లు అయితే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని బండి అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఈ నెల 25లోపే సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గ్రామాల రోడ్లకు రూ.75 కోట్ల ప్రతిపాదనలు పంపించామని.. అవి మంజూరయ్యేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. ఐటీడీఏ పథకాల్లో కాస్త చిన్నచూపు చూస్తున్నారని, అదిలాబాద్‌కు 80 వాహనాలు మంజూరు చేస్తే జిల్లాకు 20 మాత్రమే కేటాయించారన్నారు.
ఇదీ చూడండి: ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడతాం: బండి సంజయ్