కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలను వైరస్ బారి నుంచి రక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వైరస్ వ్యాప్తి నివారణ లాక్డౌన్ వల్లనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణ సహా ఇతర అంశాలపై కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దేశానికే ఆదర్శం:
గిరిజనులకు రానున్న రోజుల్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ప్రధాని మోదీ మెచ్చుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. కరోనా వ్యాధిగ్రస్థులకు అవసరాన్ని బట్టి రెమ్డెసివిర్ ఇంజక్షన్ అందించాలని తెలిపారు. జిల్లాకు ప్రతిరోజు 50 ఇంజక్షన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఆ మూడు ఆసుపత్రులకు..
ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోందని మంత్రి అన్నారు. జిల్లాలో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే హైదరాబాద్లో ప్రభుత్వం కేటాయించిన మూడు ఆసుపత్రులకు వారిని పంపించాలని వైద్యశాఖను ఆదేశించారు. లాక్డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, జిల్లాకు కావలసిన నిధులు అనుకున్న మొత్తంలో కేటాయించలేకపోతున్నామన్నారు. రానున్న రోజుల్లో కావలసిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. జిల్లాలో మెడికల్ సిబ్బంది ఎక్కువగా లేరని వారి నియామకాల్లో కలెక్టర్కు స్వేచ్ఛ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, డీఎస్పీలు అచ్చేశ్వరరావు, స్వామి, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ చికిత్సలో కొత్త మందు.. 2డీజీ ఔషధం నేడే విడుదల