కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత కనకరాజును అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించారు. పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఆదివాసీలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రితో గుస్సాడీ నృత్యాలు చేయించారు.
ఆదివాసీ బిడ్డయిన కనకరాజును పద్మశ్రీ పురస్కారం వరించడం మనందరి అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. ఇది జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలన్నారు. కనకరాజు దీనస్థితిని చూసి.. తనకు ట్రాక్టర్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఆదివాసీలకు వచ్చే సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. మార్లవాయి గ్రామస్థులకు 50 రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామని పేర్కొన్నారు. గ్రామంలో నీటి ఇబ్బందులు లేకుండా చేస్తానని, రాఘపూర్ నుంచి మార్లవాయి వరకు రెండు వరుసల రహదారి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.