కుమురం భీం కలెక్టర్, జడ్పీ సీఈఓ, ఎంపీడీవోలు, ఎంపీఓలకు మధ్య వివాదం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వద్దకు చేరింది. ఆయన జిల్లాకు వచ్చి ఉద్యోగులు, పాలనాధికారితో మాట్లాడనునట్లు సమాచారం. ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జడ్పీ సీఈవో వేణు... డీఆర్‌డీఓ సురేశ్‌కు రిపోర్టు చేసి విధుల్లో చేరారు.
జిల్లా పంచాయతీ అధికారి రమేశ్... ఎంపీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా... విధుల్లో చేరారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. హరితహారం, పల్లె ప్రగతి పనులు, కరోనా నివారణ చర్యలు తీసుకోవాల్సిన సమయంలో విధులకు దూరంగా ఉండకూడదనే ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలనుసారం విధుల్లో చేరినట్లు ఉద్యోగ వర్గాలు వివరించాయి.
ఎంపీడీవోలు, ఎంపీవోలు పాలనాధికారి వైఖరిపై నిరసన తెలిపి... రెండు రోజులు విధులకు దూరంగా ఉన్నారు. వీరికి పంచాయతీరాజ్ ఉద్యోగులు మద్దతు పలికారు. వ్యవసాయ శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులు ఇదే అంశంపై జడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మిని కలిశారు.
జిల్లాకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చి... ఆయా శాఖల ఉద్యోగుల ఇబ్బందులను తెలుసుకోనున్నారు. వీరి అభిప్రాయాలు, పాలనాధికారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని నాయకులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్