కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంతో పాటు ఆయా మండలాల్లో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ... అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర వస్తువులను అధికంగా వినియోగిస్తున్నారు.
తనిఖీలు చేసి జరిమానాలు విధించినా...
కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం నిత్యం దాడులు చేస్తూ... జరిమానాలు విధిస్తున్నారు. గతేడాది మే నుంచి ఈ ఏడాది మే వరకు 715 మంది వ్యాపారుల వద్ద రూ.2.63 లక్షలు జరిమానా విధించగా... 1.08 క్వింటాళ్ల ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకుంటున్నా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగజ్ నగర్ పట్టణం నుంచి ఆయా మండలాలకు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర వస్తువులు గుట్టు చప్పుడు కాకుండా రవాణా అవుతున్నాయి. గోదాముల్లో తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ప్లాస్టిక్కు అడ్డుకట్ట పడడం లేదు.
హానీకరమని చెప్పినా... అదే పరిస్థితి
బెజ్జూర్, దహేగాం, కౌటా, చింతల మానేపల్లి, పెంచికలపేట్, సిర్పూర్(టి), కాగజ్ నగర్ మండలాల్లో ప్లాస్టిక్ కవర్లను అధికంగా వాడుతున్నారు. చిల్లర వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు వరకు వినియోగిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే చెరువులు, నదులు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. హోటళ్ల నుంచి వేడి పదార్థాలను కూడా ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్తున్నారు జనాలు. అది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాస్టిక్ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం