అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం కృషి చేయాలని కుమురం భీం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కోవలక్ష్మీ సూచించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించరాదని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.
జిల్లాలో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని... దీనికోసం అధికారులు కృషి చేయాలని కోవలక్ష్మీ అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తిర్యాని రహదారి, గుండి బ్రిడ్జి, కనరగాం బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి కాకుంటే రోడ్డురవాణా శాఖ అధికారులు సమావేశానికి రావాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. కుమురం భీం చౌక్ నుంచి ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు డివైడర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వేసవికాలంలో తాగునీటి కష్టాలు లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో అధికారుల అలసత్వం తగదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంగన్వాడీల, ఏఎన్ఎంల నియామక ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. పూర్తికాగానే వైద్య సేవలు గ్రామస్థాయిలో అందుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని... ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం త్వరలో సమగ్ర సర్వే చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని... దీని కోసం సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు
అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల అసహనం..
గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు సరిగా స్పందించడం లేదని ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశాల్లో కూడా అవే సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వచ్చామని... అయినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదన్నారు.
ఇదీ చదవండి: మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!