కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు కుమురం భీం, వట్టివాగు జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరి.. నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
కుమురం భీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లుగా ఉంది. వట్టివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 238.450 మీటర్లుగా ఉంది. ఇన్ ఫ్లో 390 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది.