కుమురం భీం జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాంకిడి చెక్ పోస్ట్‌ను.. జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతోన్న తీరును ఆయన పర్యవేక్షించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు.. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో.. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ఇతర జిల్లాల నుంచి నిత్యావసరాల వాహనాల మినహా ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు సహకరించి.. నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అచ్చేశ్వర్ రావు, సీఐ సుధాకర్, ఎస్ఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే!