కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ నుంచి రాజుర గ్రామానికి వెళ్లే మార్గంలో అయిదు కిలోమీటర్ల మేర నిర్మించిన నూతన రహదారికి రూ.2.06 కోట్లు పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదల చేశారు. గత సంవత్సరం గుత్తేదారు పనులు ప్రారంభించగా, నెల రోజుల క్రితం తారు రోడ్డు పనులు పూర్తయ్యాయి. నెలల వ్యవధిలోనే కొత్త రహదారులపై తారు లేచిపోవడం వలన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతుల పనులు
ఆసిఫాబాద్ మండలం పీఆర్ రోడ్ నుంచి నందూప గ్రామానికి రూ.40 లక్షలతో అర కిలోమీటరు మేర సీసీ రహదారిని నిర్మించారు. సీసీ నిర్మాణంలో భాగంగా నాణ్యమైన మొరాన్ని వేసి చదును చేయాల్సి ఉండగా, పక్కనే చేన్లల్లో ఉన్న మట్టిని వేసి ఎత్తు చేసి, సీసీ వేశారు. ప్రస్తుతం ఒకటి రెండు వర్షాలకే మట్టి తొలగిపోతోంది. భారీ వర్షాలు కురిసి, మట్టి కొట్టుకుపోతే సీసీ రహదారి కుంగిపోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులు చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి 80 పనులకు రూ.97 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో వంతెనలు, రహదారులు ఉన్నాయి. పంచాయతీరాజ్ నుంచి ప్రధాన్‌మంత్రి గ్రామ్‌సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) భాగంగా గత సంవత్సరం 31 రహదారులు మంజూరయ్యాయి. ఇందులో అటవీ అనుమతులు లేని కారణంగా 10 రహదారుల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. 14 రహదారుల పనులు పూర్తికాగా, 7 రహదారుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మొత్తం 44 కిలోమీటర్ల పొడవునా రహదారులను నిర్మించడానికి రూ.19.02 కోట్లు కేటాయించారు.
ఎందుకిలా అవుతున్నాయి
రహదారికి మంజూరైన నిధులు వాటాల రూపంలో పంపిణీ కావడం వల్ల నిబంధనల మేరకు నిర్మించాల్సిన రహదారులను మొక్కుబడిగా కానిచేస్తున్నారు. అయినా తారురోడ్లు నిర్మించి నెలలు, రోజుల వ్యవధిలోనే గుంతలు తేలడం నాసిరకం పనులకు పరాకాష్టగా నిలుస్తుంది. ముందుగా నాణ్యమైన మొరం పోసి, చదును చేసి, నాలుగు అంగుళాల ఎత్తువరకు 40 ఎం.ఎం. పరిమాణంలో కంకర వేసి, రోలింగ్ చేయాల్సి ఉండగా, ఇష్టానుసారంగా కంకర వేసి, రోలింగ్ చేయకుండానే వదిలేస్తున్నారు. ఈ అధ్వానపు పనుల వల్ల కొత్త రహదారులు సైతం కొద్ది కాలంలోనే శిథిలావస్థకు చేరుతున్నాయి.
బిల్లులు చెల్లిస్తాం
నూతనంగా నిర్మించిన రహదారుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే బిల్లులు చెల్లిస్తాం. రహదారులు ధ్వంసమైన విషయం మా దృష్టికి వచ్చింది. ఆయా గుత్తేదారులకు తగిన రీతిలో మరమ్మతులు చేస్తేనే పూర్తి స్థాయిలో బిల్లులు ఇస్తామని పీఆర్ ఈఈ వెంకటరావ్ తెలిపారు.
దహెగాం మండలంలోని కల్వడ గ్రామం నుంచి ఒడ్డుగూడ వరకు రూ.2.78 కోట్లతో బీటీ రహదారిని వేశారు. ప్రస్తుతం ఈ రహదారి దారుణంగా తయారైంది. అడుగుకో భారీ గుంతతో అస్తవ్యస్తంగా మారింది. సిర్పూర్-యు మండలంలోని పాములవాడ నుంచి కొడ్డిగూడకు వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.1.95 కోట్లు కేటాయించారు. పనులు సైతం ఇటీవలే పూర్తయ్యాయి. ఘాట్ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా కాలవలు తవ్వకపోవడం వల్ల తొలకరి వర్షాలకే తారు రోడ్డు అంచుల వెంబడి కొట్టుపోయింది.
ఇదీ చూడండి : అక్షయపాత్రతో అగచాట్లు పడుతున్న విద్యార్థులు