National Excellency Award 2021 : కుమురం భీం జిల్లాలో తల్లీబిడ్డలకు ప్రాణసంకటంగా మారిన రక్తహీనత సమస్యను అధిగమించడానికి జిల్లా యంత్రాంగం ఏడాదిగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ జిల్లా పోషణ్ అభియాన్ అమలులో 2021 సంవత్సరానికి దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కుమురం భీం కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రధాని మోదీ నుంచి నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు.
ఎలా సాధించారంటే..
Poshan Abhiyan : రక్తహీనత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 2500 మంది ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతులకు ఉచితంగా రాగులు, సజ్జలు, జొన్నలు, చిరుధాన్యాలకు సంబంధించిన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసి వాటిని వెయ్యెకరాల్లో సాగు చేయించారు. పండిన పంటను స్థానిక మహిళా సమాఖ్యల ద్వారా కొనిపించి, అంగన్‌వాడీ కేంద్రాలకు అందించారు. కేంద్రాల్లో నిత్యం వాటితోనే వంటలు చేసి లబ్ధిదారులకు ఆహారంగా అందించారు. ఆసిఫాబాద్ మండలంలోని సాలేగూడలో రూ.29 లక్షలతో పోషకాహార తయారీ కేంద్రాన్ని మహిళా సమాఖ్య అధ్వర్యంలో ప్రారంభించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన చిరుధాన్యాలతోపాటు, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సరఫరా చేసిన వాటితో నిత్యం ఏడు టన్నుల వరకు పోషకాహార పొట్లాలను జిల్లావ్యాప్తంగా 973 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
అవార్డు రావడం గర్వకారణం: రాహుల్‌రాజ్
పోషణ్ అభియాన్ కేటగిరీలో జిల్లాకు పరిపాలన విభాగంలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు కలెక్టర్ రాహుల్‌రాజ్. ఇందులో అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం రామకృష్ణ, సీడీపీవో సాదియా రుక్సానతో పాటు, ఐసీడీఎస్ సిబ్బంది కృషి ఉంది అన్నారు.