ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా వ్యాధి దరి చేరకుండా వ్యక్తుల మధ్య తప్పనిసరిగా దూరం పాటించాలని అధికారులు చెబుతూనే ఉన్నారు. దుకాణాల ఎదుట మూడు అడుగుల దూరం ఉండేలా వృత్తాలు గీశారు. ఇందులో ఉండి ఒకరు తరువాత ఒకరు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కూరగాయల దుకాణాలు సైతం దూరంగా ఏర్పాటు చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తమకేమీ పట్టనట్లుగా జనం జిల్లా కేంద్రంలో శనివారం గుంపులుగా కనిపించారు.
మరోవైపు అగ్నిమాపకశాఖ అధ్వర్యంలో పట్టణంలోని ముఖ్య కూడళ్లలో, సీహెచ్‌సీ ఆసుపత్రిలో స్ప్రే చేశారు. అత్యవసర వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలుగా ఆయా గ్రామాల పల్లె ప్రజలు పొలిమేరల్లో ఉన్న కంచెలను తీసివేశారు. ఆసిఫాబాద్‌లోని శనివారం సంతలో సాధారణ రోజుల్లోలాగే ప్రజలు కూరగాయలకు, నిత్యావసరాలకు పోటెత్తారు. సంతలల్లో సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు అంటున్నారు.
క్వారంటైన్ లెక్కలు...
రోజురోజుకీ క్వారంటైన్ లెక్కలు పెరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ శాఖల నుంచి సేకరిస్తున్న సమాచారం మేరకు శనివారం 578 మంది వారి ఇళ్లల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒక రోజు ముందు 124 మంది ఉన్నారని తెలిపిన అధికారులు మరుసటి రోజే 578కి పెరిగారని తెలిపారు. ఇందులో 40 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కాగా, మిగతా వారందరూ ఇతర రాష్ట్రాలు, కరోనా సోకిన జిల్లాల నుంచి వచ్చిన వారే. ఇందులో బెజ్జూర్ 121, కాగజ్‌నగర్ 105, సిర్పూర్-యు 97, జైనూరు 35 మంది గృహ నిర్బంధంలో ఉన్నారని అధికారులు అంటున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారని తెలుస్తోంది.
ఎలాంటి వృత్తాలు, నిబంధనలు లేని చోట అదే పరిస్థితి
తొలగుతున్న కంచెలు..
ఇతరులు గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఏర్పాటు పొలిమేరల్లో ఏర్పాటు చేసిన కంచెలను ఆయా గ్రామల ప్రజలు తొలగించారు. అత్యవసర సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గ్రామ ప్రజాప్రతినిధులు కంచెలను శనివారం తొలగించారు.
జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో రసాయనిక స్ప్రే చేశారు. సీహెచ్‌సీలోని అన్ని గదులతో పాటు, ఆవరణలో మార్కెట్ ప్రాంతంలో అగ్నిమాపక శకటం పైప్‌ద్వారా మందును పిచికారీ చేశారు. అందరినీ పరీక్షిస్తున్నాం..
-కుమురం బాలు, జిల్లా వైద్యాధికారి
ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా పరీక్షిస్తున్నాం. ఇందులో కొందరి క్వారంటైన్ కాల పరిమితి ముగిసింది. 14 రోజుల అనంతరం పరీక్షలు చేసినా ఎటువంటి వ్యాధి కారక లక్షణాలు కనిపించలేదు. వివిధ శాఖల అధికారులు, గ్రామ, మండల కమిటీలు ఇచ్చిన సమాచారం మేరకు క్వారంటైన్ చేసే వ్యక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
ఇదీ చూడండ: వేసవి, వ్యాక్సిన్‌పై ఆధారపడొద్దు.. సామాజిక దూరమే మార్గం: సీసీఎంబీ డైరెక్టర్