అంతరించి పోతున్న గిరిజన సంప్రదాయాలను బతికించి.. నేటి యువతకు పరిచయం చేస్తున్న కళాకారునికి తీరని కష్టం వచ్చింది. గుస్సాడి నృత్యంతో పద్మశ్రీ అవార్డు పొందిన కళాకారుడు కనకరాజు పరిస్థితి దయనీయంగా మారింది. అనారోగ్యానికి గురైన కనకరాజు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు ఆరోగ్యం దెబ్బతినగా... పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇటీవల మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా.. క్షయవ్యాధి సోకినట్టు వైద్యులు నిర్ధరించారు. ఆస్పత్రిలోనే ఉండి వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో అక్కడి నుండి తన స్వగ్రామానికి వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుండటంతో మంచానికే పరిమితమయ్యారు.
ప్రభుత్వాలు ఆదుకోవాలి...
తన ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేని దుస్థితిలో కనకరాజు ఉన్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. కనకరాజుకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ఆర్థికంగా ఆదుకోవాలని ఆదివాసీ గిరిజనులు కోరుకుంటున్నారు. ఎంతో మంది ఆదివాసీలకు గుస్సాడి నృత్యాన్ని నేర్పించిన గొప్ప వ్యక్తికి ఆదరణ కరవైందని ఆందోళన చెందుతున్నారు.
ఇందిరా గాంధీ హయాంలోనే...
మూలన పడిపోతున్న గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి.. కనకరాజు పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు. కనకరాజు గుస్సాడి నృత్య ప్రతిభ... అప్పటి ఐఏఎస్ మడావి తుకారాం దృష్టికి రాగా.. ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలని తలచారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతరించినపోతున్న ఆదివాసీ కళను ఆదరించాలన్న తుకారాం విజ్ఞప్తికి స్పందించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. కనకరాజును దిల్లీకి పిలిపించుకున్నారు. కనకరాజుతో కలిసి ప్రధాని కూడా గుస్సాడి నృత్యంలో కాలు కదిపారు. అప్పటి నుంచి గుర్తింపు పొందిన గుస్సాడి కనకరాజు... ఇండియా గేట్ వద్ద ఓ సారి, బాపు ఘాట్ వద్ద రెండు సార్లు, స్వతంత్ర దినోత్సవంలో మూడు సార్లు తన ప్రదర్శనలిచ్చి... పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు.