కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో ఇసుక(Sand) అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారు. పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఇసుక దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులకు మాత్రం కానరావడం లేదు.
రెవెన్యూ అధికారులతోపాటు పోలీస్, మైనింగ్ అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ పోలీసు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
కాగజ్నగర్ పట్టణంలోని పెద్దవాగు, జగన్నాధపూర్, రాస్పల్లి తదితర ప్రాంతాల నుంచి ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు దొరికితే నామమాత్రంగా జరిమానాలు విధించి వదిలి పెడుతున్నారు అధికారులు. దీంతో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. కాగజ్నగర్ మండలంలోని పరిసర గ్రామాల్లో ఇసుకను డంపు చేసి ఉంచుతున్నారు.
ఇదీ చదవండి: Covid-19: దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు