తిర్యాణి మండలంలో కొలాంగూడలో వసతి గృహంలోని సరకులను పంపిణీ చేస్తున్న అధికారులు
గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడిన కొలాం, తోటి తెగలకు ఆపద సమయంలో అండగా నిలవాలనే ఆలోచనతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్ ఝా వీరి ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసర సరకులు ఉచితంగా ఇవ్వాలని గిరిజన సంక్షేమ అధికారులను ఆదేశించారు.
జైనూరు మండలంలోనే ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ మండలంలో ఉన్న ఆదివాసీ గ్రామాలన్నింటిని కంటైన్మెంట్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ పల్లెల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు, స్థానికులు నిత్యావసర సరకులు, కూరగాయలను అందిస్తున్నారు.
మిగతా మండలాల్లోని వేలాది మంది కొలాం, తోటి ప్రజలకు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పాలనాధికారి ఆదేశాలనుసారం గిరిజన వసతి గృహాల్లో మిగిలిన నిత్యావసర సరకులను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 27న టెండర్ పూర్తి చేసి, 28 నుంచి ఒక నెలకు సరిపడా 13 రకాల నిత్యావసర సరకులను ఆదివాసీలున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అందించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 34 గిరిజన ఆశ్రమ వసతిగృహాలు ఉన్నాయి. నెల రోజులకు పైగా జిల్లాలో ఇవి మూసే ఉన్నాయి. ఇందులో త్వరగా వాడకుంటే చెడిపోయే వస్తువులను కిట్‌గా రూపొందించి పంపిణీ చేస్తున్నారు. ఇందుకు అన్ని మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు పల్లీ పట్టీలు, రాగిమాల్ట్, గసగసాలు, పసుపు, కారంతో పాటు 25 రకాల వస్తువులను పంపిణీ చేశారు.