గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతూ అధిక పనిభారం మోపుతోందని కార్మికులు ఆరోపించారు. పాఠశాల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయాలనే మెమో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
మరుగుదొడ్లను శుభ్రం చేయాలనే మెమో రద్దు చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. రెబ్బన తహసీల్దార్ రియాజ్ అలీకి వినతిపత్రం అందజేశారు.
మల్టీ పర్పస్ పేరుతో కార్మికులను ప్రభుత్వం శ్రమదోపిడికి గురిచేస్తోందన్నారు. 8గంటల పని విధానాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. కార్మికుల కనీస వేతనం 18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో పంచాయతీ సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేసారని తెలిపారు.
కరోనా సమయంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్ళతో సమానం అని సీఎం అన్నారు. ఇప్పుడు పట్టించుకోకుండా అధిక పనిభారం మోపుతు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కరోనా సమయంలో పని చేసిన కార్మికులకు కరోనా ఇన్సెంటివ్ ఇవ్వాలి. మల్టీ పర్పస్ మెమోను వెంటనే రద్దు చేయాలి.
-బోగే ఉపేందర్, ఏఐటీయూసీ నేత
ఇదీ చూడండి: ఉద్యోగులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: ఉత్తమ్