ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 892 చ.కి.మీ. కోర్ ప్రాంతంగా, 1,123 చ.కి.మీ. బఫర్ ప్రాంతంగా అధికారులు గుర్తించారు. 16 మండలాల్లోని అటవీ ప్రాంతం ఈ కేంద్రంలోకి వస్తుంది. అటవీ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ గట్టిగా చర్యలు చేపట్టాల్సి ఉండగా కార్యాచరణ అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు విలువైన కలపను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. వీరికి అటవీశాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమాయకులకు ఆశలు కల్పించి..
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న విలువైన కలప సంపదపై అక్రమార్కులు కన్నేశారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఎత్తుగడలతో అక్రమాలకు పాల్పడడంలో దిట్టలుగా నిలుస్తున్న కలప స్మగ్లర్లు అటవీ హక్కు చట్టం చాటున అమాయకులను మభ్యపెడుతున్నారు. మీరు చెట్లు కొట్టుకోండి! మీ కష్టానికి మేము కూలీ చెల్లిస్తాం. కలప మేం తీసుకుంటాం. వ్యవసాయం చేసుకోవడానికి మీకు భూమి దక్కుతుంది. దాన్ని మీరు దున్నుకోండని నమ్మిస్తున్నారు. ఇస్లాంపూర్, పాండ్వాపూర్, బిర్సాయిపేట, బలాన్‌పూర్ అటవీ ప్రాంతాల్లోని విలువైన వనాలను నరికి వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను తరలించుకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పట్టుబడినా అక్రమ వ్యాపారాన్ని మాత్రం కొనసాగించడం గమన్హారం.
అటవీ హక్కు చట్టం సాకుతో...
వలస వచ్చి తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాలని 2005లో అటవీ హక్కు చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రకారం 13, డిసెంబరు-2005కు పూర్వం నుంచి అటవీ భూములను సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాల్సిఉంది. ఆ చట్టం ప్రకారం ఇప్పటివరకు ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో లక్షా ముప్పైవేల ఎకరాల అటవీ భూములకు సంబంధించి 37,182 మంది రైతులకు హక్కుపత్రాలు ఇచ్చారు. అయితే ఆ చట్టాన్ని సాకుగా చేసుకొని కొందరు ఇతర ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతానికి వలస వచ్చి ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా అడవిలోని వృక్షాలను నరికి వేస్తున్నారు.
పీడీయాక్ట్ ప్రకారం కేసులు నమోదు...
అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. స్మగ్లర్లపై పీడీయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. అటవీ హక్కుపత్రాలు వస్తాయని అడవులను ఎవరు కొట్టినా నేరమేనని వివరించారు. సాధ్యమైనంత త్వరగా అటవీ ప్రాంతంలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : అక్రమ క్వారీలు.. అడ్డగోలు తవ్వకాలు