కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. తిర్యాని మండల కేంద్రానికి చెందిన దీనవేణి లచ్చయ్య కుటుంబీకులు.. తమ భూమి తమకు అప్పగించాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు.
అసలేం జరిగింది
గంగాపూర్ శివారు సర్వే నంబర్ 31లో 4.15 ఎకరాల సాగు భూమిని 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. గత సంవత్సరం తిర్యాని బ్యాంకు నుంచి పంట రుణం కింద రూ. లక్షా ఎనభై వేల రుణం కూడా తీసుకున్నామని చెప్పారు. నాలుగు రోజుల క్రితం మళ్లీ బ్యాంకు రుణం కోసం వెళ్లినప్పుడు భూమి ఇతరులకు పట్టా అయిందని వారికే రుణం మంజూరయిందని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో కంగుతిన్న లచ్చయ్య.. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమాచారం సేకరించాడు. మండల కేంద్రానికి చెందిన తెరాస నాయకుడు బొమ్మ గౌణి శంకర్ గౌడ్.. తన అల్లుడు, కొడుకు పేరున పట్టా చేయించుకున్నట్లు రికార్డులో నమోదైంది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన లచ్చయ్య.. కుటుంబీకులతో కలిసి ధర్నా చేపట్టాడు. పోలీసులు వచ్చి వారిని సమాధానపరచడంతో ఆందోళన విరమించారు.
చెలిమెల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి దీనవేణి లచ్చయ్య దగ్గర భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారని తహసీల్దార్ తెలిపారు. వారు మళ్లీ ఇతరులకు అమ్ముకున్నట్లు వివరించారు. విచారణ చేపట్టి లచ్చయ్య కుటుంబానికి అన్యాయం జరిగితే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: చేర్యాల బంద్‌లో స్వల్ప ఉద్రిక్తతలు.. నాయకులు స్టేషన్‌కు తరలింపు