ఆయుర్వేదంలో పలు విభాగాల్లో పీజీ చేసిన విద్యార్థులు శస్త్ర చికిత్సలు చేసేలా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని ఖండిస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణ వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఐఎంఏ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.సునీత రావుజీ (అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ), డా. కొత్తపల్లి శ్రీనివాస్ (వర్కింగ్ కమిటీ మెంబర్) కాగజ్‌నగర్ పట్టణ ఐఎంఏ అధ్యక్షులు డా.కొత్తపల్లి అనిత పలువురు పట్టణ వైద్యులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో ఆయుర్వేద వైద్యం, అల్లోపతి వైద్యం దేనికదే ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ.. రెండింటినీ కలిపి మిక్సోపతి చేయడం సరికాదని ఐఎంఏ అకాడమీ మెడికల్ స్పెషలిస్ట్ డా.సునీత పేర్కొన్నారు. అలా చేయడం వల్ల ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆయుర్వేద విద్యార్థులు శస్త్ర చికిత్స విధి విధానాలను తగిన నియంత్రణతో పాటించే అవకాశం లేదని ఐఎంఏ వర్కింగ్ కమిటీ మెంబర్ డా. కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. మిక్సోపతిని ప్రోత్సహించడం అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవటమే అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులపై కేంద్రం పునరాలోచించుకోవాలని సూచించారు. ఈ మిక్సోపతిని ఐఎంఏ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
అనంతరం కాగజ్‌నగర్ పట్టణం నుంచి ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గంలోకి ఎన్నికైన డా.సునీత రావుజీ, డా.కొత్తపల్లి శ్రీనివాస్‌లను పట్టణ వైద్యులు ఘనంగా సన్మానించారు.